close

ఆర్గానిక్‌ రసాయనాలకు ఎగుమతుల కిక్కు! 

కలిసొస్తున్న చైనా పరిణామాలు 
రూపాయి పతనం కూడా ఒక కారణం 
ఈనాడు - హైదరాబాద్‌ 

క మార్పు ఎన్నో కష్టాలు తెచ్చిపెడుతుంది. ఒక్కోసారి అందులో అనుకోని అవకాశం కూడా లభిస్తుంది. అటువంటి సందర్భమే ఇప్పుడు వచ్చింది. ముడి ఔషధాలు, రసాయనాలు తయారు చేసి మనదేశంతో ప్రపంచ దేశాలన్నింటి మార్కెట్లను ఆక్రమించిన చైనా గత కొంతకాలంగా జోరు తగ్గించింది. దీనికి ప్రధాన ‌కారణం కాలుష్యం. ఇష్టానుసారంగా రసాయనాలు, ముడి ఔషధాలు తయారు చేసే చైనాలోని ఫ్యాక్టరీలు భారీగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఈ కాలుష్యం ఎంతగా పెరిగిందంటే... ఆ దేశంలోని బీజింగ్‌, షాంగై వంటి నగరాలను కాలుష్య మేఘాలు కమ్మేసేటంతగా. దీంతో కాలుష్యకారక రసాయన  పరిశ్రమలను చైనా కట్టడి చేయటం ప్రారంభించింది. కాలుష్యాన్ని తగ్గించకపోతే మూసివేతే... పద్ధతిని నిక్కచ్చిగా అమలు చేసింది. దీంతో ఆ దేశంలో బల్క్‌ ఔషధాల తయారీ, ఎగుమతులు క్షీణించాయి. ఈ పరిస్థితులు మనదేశంలోని రసాయనాలు తయారు చేసే సంస్థలకు కలిసివస్తోంది. ముఖ్యంగా ఆర్గానిక్‌ రసాయనాలు తయారు చేసే సంస్థలు ఒకపక్క దేశీయ అమ్మకాలను పెంచుకుంటూ మరోపక్క అధిక ఎగుమతులను కూడా నమోదు చేయగలగుతున్నాయి. ఇటీవల కాలంలో మనదేశం నుంచి ఆర్గానిక్‌ రసాయనాల ఎగుమతులు పెరుగుతున్నట్లు, దీనికి పొరుగుదేశంలో ఉన్న పరిస్థితులు, రూపాయి మారకవం విలువ దోహదపడుతున్నాయని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఇటీవల భారీగా పతనం అయిన సంగతి తెలిసిందే. కేవలం గత మూడు నెలల వ్యవధిలోనే రూపాయి మారకం విలువ 9 శాతం వరకూ తగ్గిపోయింది. దిగుమతులకు దీనివల్ల ఎంతో ఇబ్బంది.... కానీ ఎగుమతులకు ఎంతో అనుకూలం. అది కూడా ఆర్గానిక్‌ రసాయనాల విషయంలో సానుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారు.  మనదేశంలో గుజరాత్‌, మహారాష్ట్ర, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆర్గానిక్‌ రసాయనాలు తయారు చేసే యూనిట్లు అధికంగా ఉన్నాయి. ఈ యూనిట్ల నుంచి పొరుగుదేశం అయిన చైనాకు, కొన్ని ఇతర దేశాలకు బల్క్‌ ఔషధాలు, ఆర్గానిక్‌ రసాయనాలు ఎగుమతి అవుతున్నాయి. దీంతో పాటు ఇటీవల కాలంలో ఆఫ్రికా, ఐరోపా దేశాలకు రసాయన ఎగుమతులు కొంత పెరిగినట్లు సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి.

చైనా అతిపెద్ద మార్కెట్‌ 
పొరుగున ఉన్న చైనా అతి పెద్ద మార్కెట్‌ కాగా, మనదేశం నుంచి పెద్దఎత్తున ఎగుమతులు నమోదు చేసే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నామనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వం ఇప్పుడు దీనిపై దృష్టి సారించింది. ప్రస్తుత ప్రయత్నాలు ఫలిస్తే చైనాకు ఔషధాలు, సాఫ్ట్‌వేర్‌, వ్యవసాయ- సముద్ర ఉత్పత్తులు అధికంగా ఎగుమతి చేసే అవకాశం వస్తుంది. 2017-18లో భారత్‌ 15.6 బి.డాలర్ల ఔషధ ఎగుమతులు చేసింది. అందులో చైనా వాటా 41 మి.డాలర్లు (0.2%) మాత్రమే. ఐటీ, ఐటీఈఎస్‌ ఎగుమతులు మనదేశం నుంచి 120 బి.డాలర్ల మేరకు ఉండగా, అందులో చైనా వాటా 1% ఉంది. మనదేశం నుంచి సముద్ర ఉత్పత్తుల్లో 2.17%, వ్యవసాయ ఉత్పత్తుల్లో 2.8% మాత్రమే చైనాకు ఎగుమతి అయ్యాయి.దీన్ని బట్టి చైనాపై దృష్టి సారిస్తే ఎగుమతులను బాగా పెంచుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. చైనాతో మనదేశానికి వర్తక లోటు అధికంగా ఉన్న విషయం విదితమే. రెండు దేశాల మధ్య గత ఆర్థిక సంవత్సరంలో 89.71 బి.డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. ఇందులో మనదేశం నుంచి చైనాకు ఎగుమతులు 13.33 బి.డాలర్లు కాగా, చైనా నుంచి మనదేశానికి 76.38 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులు దిగుమతి అయ్యాయి.

ఇవీ కొన్ని ఆర్గానిక్‌ రసాయనాలు 
అసెటిక్‌ యాసిడ్‌ బీ అసెటోన్‌  బీ బెంజీన్‌ బీ ఫెనాల్‌ 
మెథనాల్‌బీ ఫార్మాల్‌డిహైడ్‌ 
నైట్రోబెంజీన్‌ 
సిట్రిక్‌ యాసిడ్‌ 
మలేయిక్‌ అన్‌హైడ్రేట్‌ 
ఇథైల్‌ అసిటేట్‌ 
మెంథాల్‌

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.