close
BETA SITE

ఐటీకి ఆ మాటలే కీలకం 

ఫలితాల కంటే భవిష్యత్‌ అంచనాలే ముఖ్యం 
ఇన్ఫోసిస్‌ కొత్త సారథి ప్రణాళికలూ.. 
కంపెనీల సగటు నికర లాభంలో క్షీణత 
ఆదాయాల్లో మాత్రం రాణింపు 

ఐటీ అనగానే గుర్తుకు వచ్చేది టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ కంపెనీలే. ఈ కంపెనీల ఫలితాలు ఈ వారమే వెలువడనున్నాయి. ఆ కంపెనీలతో పాటు ఇతర కంపెనీలు సైతం ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ ఫలితాల సరళిని బట్టే మిగతా ఫలితాలు, షేర్ల కదలికలు ఆధారపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ రంగ ఫలితాలు అసలు ఎలా ఉండనున్నాయో విశ్లేషకులు ఏమనుకుంటున్నారో చూద్దాం.
ఈ సారి ఐటీ కంపెనీల ఫలితాల కంటే భవిష్యత్‌ అంచనాలపైనే మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. ముఖ్యంగా క్లయింట్ల బడ్జెట్లు, వీసా నిబంధనల్లో మార్పు విషయంలో కంపెనీల ధోరణి తదితరాలు గమనించాల్సిన అంశాలు. అన్నిటి కంటే మించి ఇన్ఫోసిస్‌ను 2020 కల్లా 20 బిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరడానికి కొత్త ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ) సలీల్‌ పరేఖ్‌ ఎటువంటి ప్రణాళికలు రచిస్తారన్నది కీలకం కానుంది.

ఈ అంశాలు కీలకం.. 
* బ్రెగ్జిట్‌ చర్చలను గమనించొచ్చు. ఎందుకంటే ఇవి బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగంపై భారీ ప్రభావాన్ని చూపనున్నాయి. మన టెక్నాలజీ కంపెనీలకు ఎక్కువ భాగం విక్రయాలు ఈ రంగాల నుంచే వస్తున్నాయి. 
* ఈ రంగంలో అత్యధిక మార్కెట్‌ విలువ గల రెండు కంపెనీలు ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ సైతం బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల నుంచి గరిష్ఠ ఆదాయాలను పొందుతున్నాయి. 
* టెక్‌ మహీంద్రా వంటి కంపెనీలకు కమ్యూనికేషన్స్‌ నుంచి సగం ఆదాయాలు లభిస్తున్నాయి. 
* ఈ నేపథ్యంలో బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల నుంచి వచ్చే గిరాకీపై విశ్లేషకులు ఓ కన్నేయవచ్చు. 
* ఇక టీసీఎస్‌ తప్ప మిగతా చాలా వరకు ఐటీ కంపెనీలకు రిటైల్‌ విభాగం ఇబ్బందులను కొనసాగించే అవకాశం ఉంది. టీసీఎస్‌ విషయంలో మాత్రం ఈ రంగం నుంచి గిరాకీ పుంజుకునే అవకాశం ఉంది.

ఇవీ అంచనాలు 
ఐటీ కంపెనీలకు అక్టోబరు-డిసెంబరు సాధారణంగానే బలహీన త్రైమాసికం. అమెరికాలో సెలవుల కారణంగా ఆర్థిక, రిటైల్‌ రంగంలో వ్యయాల మందగమనం ఇందుకు నేపథ్యం. తొమ్మిది ప్రధాన ఐటీ కంపెనీల సగటు నికర లాభం అంతక్రితం ఏడాది అక్టోబరు-డిసెంబరుతో పోలిస్తే 3 శాతం క్షీణించొచ్చని అంచనా(పట్టిక చూడండి). ఇక విక్రయాలు మాత్రం 4 శాతం మేర రాణించొచ్చని విశ్లేషకుల సగటు అంచనాగా ఉంది.


టీసీఎస్‌కు ఆ విక్రయాలే ముఖ్యం
నేడు ప్రకటించే టీసీఎస్‌ ఫలితాలు మొత్తం ఐటీ కంపెనీలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అయితే ఈ కంపెనీకి కీలక వ్యాపార విభాగమైన బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా(బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగంలో ఎంత మేర బలహీనతలు కనిపిస్తాయన్నదానిని మదుపర్లు సునిశితంగా గమనించనున్నారు. ఆర్థిక సేవల విభాగంలో నిర్ణయాలను తీసుకోవడంలో ఆలస్యం కావడంతో బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్‌ విభాగాల్లో స్తబ్దత చోటు చేసుకోవచ్చని డిసెంబరులో టీసీఎస్‌ విశ్లేషకులతో పేర్కొన్న సంగతి ఇక్కడ గమనించదగ్గ విషయం. టీసీఎస్‌ విక్రయాల్లో బీఎఫ్‌ఎస్‌ఐ విభాగానికి 33 శాతం వాటా ఉండగా.. రిటైల్‌ విభాగానికి 11.9 శాతం వాటా ఉంది. రిటైల్‌ విభాగంలోనూ కంపెనీకి ప్రతికూల పవనాలు వీచే అవకాశం ఉందని అంచనా. ఇక అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో కీలక మార్కెట్‌ అయిన అమెరికాలో సెలవులు కావడం వల్ల కూడా విక్రయాలపై ఒత్తిడి కనిపించొచ్చు. ఈ నేపథ్యంలో అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర విక్రయాలు రూ.30,941 కోట్లుగా నమోదు కావొచ్చని 10 మంది విశ్లేషకుల సగటు అంచనాగా ఉంది. ఇక జులై-సెప్టెంబరుతో పోలిస్తే ఏకీకృత నికర లాభం రూ.6,393 కోట్లుగా నమోదు కావొచ్చని అంచనా కట్టారు. ఫలితాల కంటే క్లయింట్ల బడ్జెట్‌పై కంపెనీ చేసే వ్యాఖ్యల కోసం మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూడవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.