close
BETA SITE

కర్ణాటకపైనే కళ్లన్నీ..! 

రేపు వెలువడనున్న ఎన్నికల ఫలితాలు 
భాజపా గెలిస్తే మార్కెట్ల పరుగు 
నిఫ్టీ 10720- 10880 మధ్య కదలాడొచ్చు 
టెలికాం, ఫార్మా షేర్లకు అమ్మకాల ఒత్తిడి 
వాహన షేర్లకు సానుకూలతలు 
విశ్లేషకుల అంచనాలు

దాదాపు మూడు నెలల తరవాత 10,800 పాయింట్లను మళ్లీ అందుకున్న నిఫ్టీ.. ఆ జోరును కొనసాగించే అవకాశం ఉంది. రేపు వెలువడనున్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయి. భాజపా గెలిస్తే.. 2019లో సుస్థిర ప్రభుత్వం ఎర్పడొచ్చన్న అంచనాలతో సూచీలు పరుగులు తీయొచ్చు. ప్రతికూల ఫలితం వస్తే మాత్రం నష్టాలు తప్పకపోవచ్చు.  దేశీయ పరిణామాల్లో.. కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలపై మదుపర్లు దృష్టిసారిస్తారు. సీపీఐ, డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు సైతం ప్రభావం చూపొచ్చు. రానున్న రోజుల్లో నిఫ్టీకి 10850- 10880 పాయింట్ల శ్రేణిలో నిరోధం, 10720- 10760 పాయింట్ల శ్రేణిలో మద్దతు లభించొచ్చని సాంకేతిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టెలికాం, ఔషధ షేర్లకు అమ్మకాల ఒత్తిడి కొనసాగొచ్చని, వాహన, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు రాణించే వీలుందని చెబుతున్నారు. ఆయా రంగాలు, కంపెనీల షేర్లపై విశ్లేషకుల అంచనాలు ఇలా.. 
* జియో దూకుడుతో టెలికాం రంగ షేర్లపై ఒత్తిడి కొనసాగొచ్చు. ఎయిర్‌టెల్‌ షేరు బలహీనంగానే ఉన్నా.. ఐడియా పుంజుకునే అవకాశం ఉంది. 
* అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సంకేతాలను ఐటీ షేర్లు అందిపుచ్చుకోవచ్చు. డాలరుతో పోలిస్తే రూపాయి బలహీనపడటం ఈ రంగ షేర్లకు దన్నుగా నిలుస్తాయని చెబుతున్నారు. 
* పారిశ్రామికోత్పత్తి 5 నెలల కనిష్ఠానికి చేరడంతో భారీ యంత్రపరికరాల షేర్లు ప్రతికూలంగా కదలాడొచ్చు. 
* సానుకూల సెంటిమెంట్‌తో వాహన రంగ షేర్లు రాణించే అవకాశం ఉంది. అన్ని విభాగాల్లో మంచి అమ్మకాలు నమోదు కావడం సానుకూల ప్రభావం చూపనుంది. 
* ఈవారం ఐటీసీ, హిందుస్థాన్‌ యునిలీవర్‌ వంటి దిగ్గజ ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. బ్రిటానియా, ప్రభాత్‌ డెయిరీ షేర్లపై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. 
* సిమెంటు రంగ కంపెనీల షేర్లు ఈవారం మిశ్రమంగా కదలాడొచ్చు. ఏసీసీ, అంబుజా సిమెంట్‌ షేర్లకు నష్టాలు కొనసాగొచ్చు. ఇదే సమయంలో అల్ట్రాటెక్‌, గ్రాసిమ్‌ షేర్లు సానుకూలంగా కనిపిస్తున్నాయి. 
* జనవరి- మార్చి త్రైమాసిక ఫలితాల నుంచి లోహ, గనుల కంపెనీల షేర్లు సంకేతాలు తీసుకోవచ్చు. 
* ఔషధ రంగ షేర్లకు ఈవారం నష్టాలు కొనసాగే అవకాశం ఉంది. ఔషధ ధరలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రసంగం నుంచి మదుపర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. 
* బ్యాంకింగ్‌ షేర్ల జోరు కొనసాగొచ్చు. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. 
* అప్‌స్ట్రీమ్‌ కంపెనీలైన ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాపై చమురు ధరలు పెరœగడం సానుకూల ప్రభావం చూపించొచ్చని చెబుతున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.