close
BETA SITE

అంతర్యామి

రాజీ మార్గం 

రాజీ మార్గం 

నమ్మిన విలువలు, ధర్మం కోసం ఆదర్శమూర్తులు ఎలాంటి విషమ పరిస్థితులనైనా ఎదుర్కొంటారు. ఎంతటి కష్టనష్టాలు భరించడాని కైనా సిద్ధమవుతారు. అలా నిలిచిన ధన్యుల జీవితాల్ని చరిత్ర తన పుటల్లో బహుకాలం భద్రపరచుకొంటుంది.
‘స్వామీ! నార వస్త్రాలతో వనవాసానికి వచ్చిన మీకు ఈ శస్త్రాస్త్రాలు ఎందుకు’ అని సీతమ్మ అవతార పురుషుడు రామయ్యను అడుగుతుంది. ‘దానవుల నుంచి రక్షించాలని ఈ దండకారణ్యంలోని మునులు నన్ను కోరారు. వారికి మాట ఇచ్చాను. అది నిలబెట్టుకోవడం నా ధర్మం. అందుకోసం ప్రాణాలైనా విడుస్తాను. లక్ష్మణుడిని, చివరకు నిన్ను త్యాగం చేయడానికీ నేను సిద్ధమే’ అని బదులిస్తాడు దాశరథి. వాల్మీకి రామాయణంలోని ఈ ఘట్టం నిబద్ధత  ప్రాధాన్యాన్ని వివరిస్తుంది.

భవభూతి మహాకవి నాటకంలో శ్రీరాముడు- ‘ప్రజాహిత పాలనే నా లక్ష్యం’ అంటాడు.   అవసరమైతే స్నేహాన్ని, దయను, సౌఖ్యాన్ని, ఆఖరికి తన పుణ్యాల పంట జానకీదేవినైనా రాజధర్మ నిర్వహణ కోసం పరిత్యజించాల్సి వస్తే బాధపడనని ప్రకటిస్తాడు.

ఇలా సత్యం, ధర్మం వంటి విలువల    విషయంలో రాజీపడని నిబద్ధతను సమాజం ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చింది.

మౌలికమైన విలువలు, నైతికతకు సంబంధించి రాజీపడని జీవితమే ఆదర్శప్రాయం. అలాంటి జీవితం గడపటాన్ని సంఘం, సంప్రదాయ వ్యవస్థ ఆమోదించి ఆదరించడమూ సహజమే. సంఘంలో దైనందిన వ్యవహారాలు సామ మార్గానికి లేదా ఏకాభిప్రాయ సాధనకు అవకాశమే లేని విధంగా మారితే, సంఘర్షణలకు దారితీస్తుంటే- సమాజం బలహీనమవుతుంది. విపరీతమైన అనైక్యత దేశాన్ని ఏ ఇతర శత్రువూ తీయలేనంత బలంగా దెబ్బతీస్తుంది. ఇదీ ముఖ్యమైన పాఠం, ఇదే తరతరాల చరిత్ర. ఇది భారత్‌కు బోధించినంత స్పష్టంగా మరి ఏ ఇతర దేశానికీ నూరిపోయలేదు.

శ్రీరాముడు ఏ దశలోనూ ఇతర విలువలతో రాజీపడలేదు అంటే అర్థం, ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరూ తన పద్ధతినే అనుసరించాలన్న ధోరణి కనబరచాడని కాదు.

సీతాపహరణం అనే మహాపరాధం చేశాడు రావణుడు. ఆ తరవాత జరిగిందేమిటి? సంగ్రామానికి ముందు కూడా అతడితో శ్రీరాముడు రాయబారాలు నడిపాడు.

మహాభారత యుద్ధానికి ముందు- దివ్య వరప్రసాదులు, మహా పరాక్రమవంతులైన పాండవ సహోదరులు రాజీ మార్గానికే సంసిద్ధత చూపారు. రాజీ లేని రీతిలో పోరుకు కాలుదువ్వింది రారాజు వైపు నిలిచిన దుష్ట చతుష్టయమే! వ్యక్తిగతంగా తన సత్య, ధర్మాచరణ విషయంలో ఏనాడూ రాజీపడి ఎరుగడు భీష్ముడు. పాండవ కౌరవులిద్దరూ కజ్జాలు నిరంతర ఘర్షణలు మానుకొని, రాజీమార్గం అవలంబించి సుఖంగా ఉండాలని ఆయన మొదటినుంచీ హితవు చెబుతూ వచ్చాడు.

ధర్మజ్ఞులలో అగ్రగణ్యుడు ధర్మరాజు. అయిదుగురు పాండవులకూ అయిదు ఊళ్లు ఇస్తే చాలని రాజీమార్గం ప్రతిపాదించాడు. అందువల్ల ఆయన యశస్సుకు ఏ భంగమూ కలగలేదు. మూడు లోకాలూ ఆయన ధర్మబుద్ధికి బ్రహ్మరథం పట్టాయి. అలవిమాలిన మొండితనంతో దుర్యోధనుడే అధర్మపక్షాన నిలిచాడు. రాజీ లేని పోరాటానికి దిగి ఆత్మ, కుల, సర్వనాశనం కొనితెచ్చుకొన్నాడు. విషయాన్ని అర్థం చేసుకోలేక, ఎందుకూ కొరగాకుండాపోయి చివరికి అపకీర్తి మూటగట్టుకున్నాడు.

నీతిబాహ్యమైన రాజీ- అవకాశవాదమే అవుతుంది. నీతిబద్ధమైన రాజీ మార్గాలు వ్యక్తుల మధ్య, సమాజంలోనూ సామరస్యానికి, మైత్రికి, పరస్పర అవగాహనకు పర్యాయపదాలు. పురోగతికి అవి సోపానాలు. ‘మైత్రీభావాన్ని పెంపొందించు. అది అన్ని హృదయాల్నీ జయిస్తుంది’ అంటారు కంచిస్వామి. అదే ‘నడిచే దేవుడు’గా పేరొందిన ఆయన సందేశం!

- మల్లాది హనుమంతరావు

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.